Saturday, May 23, 2009

విశ్వం పరిధి - కాలం నిడివి

"న కాంక్షేవిజయం కృష్ణ నచ రాజయం సుఖావిచ
కిం నోరాజ్యేన గోవింద భోగైర్జీవితేనవా"

యుద్ధ రంగంలో తనకు తారసపడిన బంధువులను, మిత్రులను, తాతలను, తండ్రులను, మనుషులను, మామలను,
గురువులను చంపుటకు ఇష్టపడని అర్జునుడు విషాదానికి గురై నాకు విజయం వలదు, రాజ్యం వలదు సుఖములపై,
భోగములపై ఎంతమాత్రం వ్యామోహం లేదనుచు ధనుర్భానములను క్రిందవేసిన అర్జునుడికి జ్ఞానమును ప్రసాదించే
క్రమంలో శ్రీ కృష్ణుడు పడిన పాట్లెన్నో ?


అర్జున విషాద యోగంతో మొదలై మోక్ష సన్యాస యోగముతో ముగిసిన భగవద్గీత 18 అధ్యాయాలలోని 700 శ్లోకాల
ఉద్దేశం అర్జునునికి జ్ఞానమును కలిగించటానికే, అయితే 11 అధ్యాయం "విశ్వరూప సందర్షన యోగం" యొక్క
ప్రభావం అర్జునునిపై కాస్తా ఎక్కువేనని చెప్పవచ్చును.


"సంకుచితత్వం సమసిపొవాలంటే అంతరిక్షాన్ని అవలోకించు
అనంత విశ్వంలో నీ అస్తిత్వం ఎంత సూక్ష్మమో అవగతమయ్యేకొద్ది
నీ అంతరంగం అంత విస్తృతము అవుతుంది" ____ ఒక తత్వవేత్త.

ఇల్లు, ఇల్లాలు, పిల్లలు,భూములు,ప్లాట్లు, ఆస్తులు, బ్యాంకు బ్యాలన్సులు అనేక సుఖాలను చవిచూపే దేహం,
ఆత్మీయతల్ని పంచుతూ తన చుట్టు ఇతర కొన్ని దేహాలు, ఆది అంతములు కనిపించక నిత్యం ప్రవాహంలా సాగిపోయే
కాలంలో నీ చరిత్ర ఎక్కడ ప్రారంభమైనది, ఎక్కడ ముగియనున్నది? అంచులంటూ కనిపించని విశాల విశ్వంలో ఎక్కడ
స్థిరపడి ఉన్నావు? ఎప్పుడు కనుమరుగు అవుతావు? సమాధానం లభించని ప్రశ్నలను ఒక్కసారి కూడా

స్పృశించుకోని మానవుడు చీకటిలో బతుకుతు,చీకటిని పీలుస్తు, చీకటిని తింటూ వంటి నిండా చీకటిని
పులుముకుంటూ ఆనందిస్తున్నాడు.


భూమికి 15 కోట్ల కి.మీ. దూరంలో ఉన్న సూర్యుని నుండి ఉదయం తెల్లవారగానే సెకనుకు 3 లక్షల కి.మీ వేగంతో
బయలుదేరిన సూర్యకిరణం 8 ని. 20 సెకన్లలో భూమికి చేరుతుంది. ఎంతో విశాలమైనదిగా భవించే మన భూమి
కంటే 13 లక్షల రెట్లు ఎక్కువ ఘనపరిమాణం కలిగిన సూర్యుడు తన చుట్టూ నియమిత కక్ష్యలలో తిరిగే 9 గ్రహాలను
కలిగి సౌరకుటుంబంగా పిలువబడుతున్నాడు. ఇలాంటి సౌరకుటుంబాలు 3 వేల కోట్లు కలిస్తే ఏర్పడే మందలాన్ని
"నిబ్యులా" అని, ఇలాంటి నెబ్యులాలు కొన్ని కోట్లు కలిస్తే ఏర్పడేదే గెలాక్సీ లేదా దుగ్దపథం లేదా పాల పుంతగా
పిలువబడుతుంది.


మన సౌరకుటుంబం స్థిరపడి యున్న పాల పుంతను " ఆకాశ గంగ" గా వ్యవహరించుకుంటున్నాము. 1500 కోట్ల
సూర్యుడి లాంటి నక్షత్రాలను కలిగి యున్న పాల పుంత వ్యాసం ఒక లక్ష కాంతి సంవత్సరాలు. భూమి మాదిరిగానే
సూర్యుడు కూడా తన చుట్టు తాను తిరుగుతూ పాల పుంత చుట్టూ తిరుగుతాడు. అందుకు పట్టేకాలం 24 కోట్ల
సంవత్సరాలు.


విశాల విశ్వంలో మన సౌర కుటుంబంలోని సూర్యుడు కాక భూమి కి అతి సమీపంగా ఉండే నక్షత్ర దూరం 4.28 కాంతి
సంవత్సరాలైతే, అతి దూరంగా ఉండే నక్షత్రం దూరం 100 కోట్ల కాంతి సంవత్సరాలు __ విశ్వం పరిధి ఇదైతే కాలం
నిడివిని ఒకసారి తడిమి చూసుకుందాం.


ఋగ్వేదం ప్రకారం కృత యుగం (17,28,000 సం.లు) త్రేతా యుగం (12,96,000 సం.రాలు) ద్వాపర యుగం
(8,64,000 సం.రాలు) , కలియుగం (4,32,000 సం.రాలు) లను కలిపి చతుర్యుగంగా పేర్కోంటాం. మొత్తం
చతుర్యుగం కాలం 43,20,000 సం..రాలు. ఇలాంటి 71 చతుర్యుగములు కలిస్తే ఏర్పడేదే ఒక మన్వంతరం. ఇప్పటికి 6
మున్వంతరరాలు గడిచినవి. (స్వాయంభవుడు, స్వారోచిషుడు, ఔత్తమి, తామసుడు, రైవతుడు, చాక్షసుడు ఆరుగురు
మనువుల పేర్లివి). ప్రస్తుతం మనము ఏడవ మన్వంతరమైన దైవస్వతములోని 28 చతుర్యుగములో ఉన్నాము.


విధంగా సంకుచితత్వంలో మ్రగ్గిపోయే ప్రతి మనిషి తన మటుకు తాను విశ్వరూప సందర్షన యోగాన్ని ప్రాప్తింప
చేసుకొని తనలోని సంకుచితత్వాన్ని పటాపంచలు చేసుకుంటాడని ఆశిద్దాం !

Friday, May 22, 2009

సాంసారిక లంపటం



"మీ మానవులు చాలా స్వార్థపరులు, అహంకారపూరితులు" భక్తుడి భక్తి పారవశ్యతకు చకితుడై ఎదుట ప్రత్యక్షమై అతనితో భగవంతుడు అన్న మాటలివి.....ఎందుకు స్వామి మా పై కోపగించుకుంటారు మాలో కనిపించిన స్వార్థం, అహంకారములెట్టివో సెలవిస్తే వాటిని సరి చేసుకుని తరిస్తామన్న భక్తుడితో ఆ దేవుడు "లక్షలాది రకాలతో కోట్లాది జీవులు ఈ భూగోళం పై నివసిస్తూ ఉంటే వాటిల్లో ఏ ఒక్క ప్రాణి రూపం లో కాకుండా నన్ను మీ రూపం లోకి తెచ్చుకొని పూజించటం మీ స్వార్థమైతే, జీవులన్నింటిలొకి అత్యధిక తెలివి పరులం మానవులమైన మేమే అన్నది మీ అహంకారం కాక మరేమిటని తెలియపరచగా ఆ భక్తుడికి నోట మాట రాలేదు.

సర్వాంతర్యామి, చైతన్య స్వరూపుడు అయిన దేవుడిని తన రూపం లోకి కుదించుకుని మనిషి పూజించటం వరకు మాత్రమే ఆగలేదు, తనకున్న సాంసారిక లంపటాల్ని అన్నింటిని దేవుడికి తగిలించి మరి వినోదించసాగాడు. భార్యాపిల్లలు,బంధువులు, సంసారం,వివాహం,వేడుకలు ఇలా ఒక్కటేమిటి తాను నిత్యం ఏ కార్యకలాపాలతో పొద్దుపుచ్చుతుంటాడో వాటన్నింటిలోకి దేవుడిని ప్రతిబింబింప చేసిన ఘనుడు.

సాంసారిక బంధాలతో విసిగిన మనిషి తాత్విక చింతనను ఆలంబనగా చేసుకొని మనశ్శాంతికై గుడికి వెడితే కళ్యాణం చేసుకుంటూనో, దేవేరులతో ఊరేగుతూనో, కొడుకులను లాలిస్తునో, కూతుళ్ళను పాలిస్తునో మనకు స్వాగతం పలుకుతాడు ఆ దేవుడు. నిర్గుణుడై, నిరాకారి అయి ,విరాగి అయి, కనిపించని ఆ దేవుడు మన హృదయంలో వైరాగ్యాన్ని ఎలా నింపగలగుతాడు.

తనకున్నా సాంసారిక బంధనాలన్నింటిని ఆ దేవుడికి తగిలించి నిత్యం ఆ సాంసారిక సాగరంలో మునకలేయించే ఈ మనిషి ఆశ్రమ ధర్మాలలో గృహస్తాశ్రమాన్ని పటిష్ట పరచుకొని తదుపరి వానప్రస్థ, సన్యాసములను కనుమరుగు చేసుకుంటున్నాడేమోననిపిస్తుంది.

"ఆలు బిడ్డలనుచు, యతి మోహమున నున్న
ధనము మీది వాంఛ దగిలి యున్న
యట్టివాంకి ముక్తి యవనిలో లేదయా
విశ్వదాభిరామ వినురవేమా."

భార్యా పిల్లలపై మక్కువ, ఆస్తి పాస్తులపై లాలసతతో సతమతమయ్యే వాడు ముక్తికి మరి అనర్హుడైతే అలాంటి సాంసారిక లంపటాల్ని తగిలించుకున్న ఆ దేవుడు మనకు ముక్తి నెట్లు ప్రసాదిస్తాడో!

Thursday, May 21, 2009

లింగ వివక్ష



భగవంతుడొక రైల్వే జంక్షన్ ఐతే అతనికై చేరవచ్చే దారులెన్నో, ఏ మార్గం గుండా ఎంత దూరాన్ని వచ్చినా చివరికి చేరేది జంక్షన్ కే అన్నట్లు, ఒక చోట స్థిరమైనట్లుగా అనిపించే ఆ భగవంతుడు అంతటా, అందరిని విభిన్న రీతులలో అలరిస్తున్నాడు. మనిషి భగవంతునికై చేసె ప్రయాణం లో అనుసరించే మార్గాలు, ఆచరించే భావనలు వేరువేరుగా ఉన్నాయి. కొందరు తాము సాగించే పయనం లో పురుషులు మాత్రమే అర్హులు, స్త్రీలు అందుకు తగరనే భావనతో వారిని తమ దరికి చేరనివ్వడం లెదు.

స్త్రీ అన్న పదానికి "సంతానాన్ని ధరించునది" అని అర్థం చెప్పుకోవచ్చును. ఇట్టి సంతానాన్ని ధరించే ప్రక్రియలో దాటి వచ్చే పరిణామ గతులెన్నో, యుక్త వయస్కురాలైన స్త్రీ వివాహానంతరం భర్త తో సంభోగించిన తరుణం లో పురుషుడి నుండి స్కలితమయ్యే వీర్య కణం స్త్రీ గర్భాశయం లొనికి విడుదలయ్యె అండంతో సంయోగం చెంది, ఫలదీకరణం చెంది పిండమేర్పడిన పక్షం లో అట్టి పిండ స్థితిలొని శిశువుకు ఆహారంగా ఉపయోగపడే నిమిత్తం ముందుగానే గర్భాశయం గోడల లొకి వచ్చి చేరిన రక్తం, ఒక వెళ ఈ ప్రక్రియ యావత్తు జరగని పక్షం లో యోని ద్వారా స్రావితమవుతుంది. దీనినే "ముట్టు" అని పిలుచుకుంటాం. ముట్లుడుగని స్త్రీ అపవిత్రురాలు, ముట్లుడిగిన స్త్రీ మాత్రమే పవిత్రురాలు అన్న వివిక్షతో అట్టి స్త్రీలను కొందరు తాము ఆచరించే పూజాదికములకు దూరంగా ఉంచటం ఎంత వరకు సమంజసం?

"ముట్టు ముట్టనుచును ముట్టరాదందురు
ముట్టుకు దరియేమి మూలమేమి
నవబిలముల మురికి నరులకందరకును
పుట్టగానే పుట్టు ముట్టు వేమా" ___ అనుచు ప్రజాకవి వేమన దాదాపు 500 సం. ల క్రితమే సత్యాన్ని ఆవిష్కరింపచేశాడు.

"యావన్న విందతే జాయాం
తావదర్దో భవేన్ పుమాన్" _____ఎంతవరకు పురుషుడు భార్యను పొందడొ అంత వరకతడు పరిపూర్ణుదు కాలెడని కూడా శాస్త్రం చెబుతున్నది..

"ఏక మేవ అద్వితీయ పరమ పురుష;
సదైన రేయే సద్వితీయ మైచ్ఛత్" -----ప్రథమంగా పరమ పురుషుడు తానొక్కడే రమణాన్ని పొందలేక ద్వితీయాన్ని కాంక్షించాడు . ఆ ద్వితీయ రూపమే స్త్రీ అని ఆర్ష సంస్కృతి ఘోషిస్తున్నది..

పితౄణం,గురు,దేవ ఋణాల నుండి విముక్తిని కలిగిస్తుంది కాబట్టే స్త్రీని మన శాస్త్రాలు "త్రివర్గసాధికాస్త్రీ" అన్నాయి. అబల ఐన స్త్రీ అవసరమైతే సబలుడైన పురుషుని నాశనం చేయగలుగుతుందంటే కారణం ఈమెలో "ఇచ్ఛా జ్ఞాన,కర్మ,ప్రేరణ,సంరక్షణ,శక్తులు సుసంవిధానమై ఉండటమే.

ఈన్ని విధాల పురుషుని కెంత మాత్రం తీసిపోని స్త్రీని మిడి, మిడి జ్ఞానం తో అపవిత్రురాలిగా చూపెడుతులింగవివక్షతను పాటించటం ఎంత వరకు న్యాయం?

"స్త్రీ హి బ్రహ్మ బభూవిధ" - స్త్రీయే బ్రహ్మ _ౠగ్వేదం.
"యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" _ మనుధర్మ శాస్త్రం.

Monday, May 18, 2009

గుర్తింపుకై ప్రాకులాట



రెందు రోజుల క్రితం వధువు ఇంటి దగ్గర జరిగిన వివాహం తాలూకు వరుడి తరపున ఏర్పాటు చేసిన పెళ్ళి విందుకు వెళ్ళిన నేను స్నేహితులతో హుషారుగా మాట్లాడుతున్న సమయం లో అక్కడికి వచ్చి చేరాడు నా స్నేహితుడు వెంకటకృష్ణ. వాడిని పలకరించిన పిమ్మట అక్కడి నా స్నేహితులకి వాడి పేరు,ఊరు,చేస్తున్న ఉద్యోగం వంటి వివరాలతో పరిచయం చేశాను. ముఖాలపై నవ్వులు పులుముకొని నా స్నేహితులందరు మా వాడిని పలకరించి తమలో ఒక్కడిగా కలుపుకున్నరు. ఇక మా వాడిలో మొదలయింది తపన, తన హోదా,భేషజాలకి సరిపడే రీతిగా తనని నేను మా వాళ్ళకి పరిచయం చేయలేదనుకున్నాడేమో కాబోలు వెంటనే అందుకున్నాడు స్వంతదండకం, ఫలాన బిజినెస్ మాగ్నట్ సుబ్బారావ్ లేడండి అతను నాకు స్వయాన మేనమామ, సెక్రటేరియట్ లో డిప్యూటి సెక్రటరి హోదాలో పని చేసె కిషోరు బాబు మా తోడల్లుడు, ఉస్మానియా యూనివర్సిటి లో "డీన్" గా పని చేసె సుబ్రమణ్యం మా పెద్దమ్మ గారి కొడుకు అంటూ ఇలా చెప్పుకుంటూ క్షణ క్షణానికి ఎదుటి వారిలో తన పట్ల గౌరవ సూచక దృక్కుల్ని వెతుకులాడుతున్నాడు.
నిజమే! ఈ రోజు పెళ్ళి విందు రేపు మరొకటి ఏదైతేనేం నలుగురు చేరిన ప్రతి చోట తన పరిచయం తాలూకు వివరాలన్ని వీలైనన్ని ఎక్కువ చెప్పుకుంటేనే గాని తమ ఉనికిని ధ్రువపరచుకోని మహనీయులెందరో కదా!
తన ఉనికిని గోరంతలు కొండంతలుగా చెప్పుకుంటేగాని ఎదుటివారికి తన పట్ల గౌరవం కలగదనుకునే దౌర్భాగ్యుల దృష్ట్యా ఈ క్రింది దృష్ట్యాంతమును చెప్పుకుందాం.

నూనుగు మీసాల నూత్న యవ్వనంలోకి ప్రవేశించిన శ్రీరాముడు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని దేశదేశాలు పర్యటించి, పుణ్యక్షేత్రాలు సేవించుకొని అయోధ్యకు తిరిగి వచ్చాడు, వచ్చిన నాటి నుండి ఎవరితోను మాట్లాడటం లేదు, ఎవరు పలకరించినా ముభావంగా ఉంటున్నాడు,, మనిషి జీవితం లో పుట్టింది మొదలు గిట్టేవరకు అనునిత్యం సంఘర్షణలను తలచుకొని ఏం ప్రయోజనార్థం ఈ లోకానికి వచ్చాం, ఏం సాధించి ఇక్కడి నుండి నిష్క్రమిస్తున్నాం...ఈ మధ్య జీవితం లో ఎన్ని మజిలీలు, ఎన్ని బాంధావ్యాలు, బాధలు ఇలాంటి మనోవైకల్యం తో నిర్గుణుడై యున్న కొడుకుని చూచి బాధపడిన దశరథుడు రేపటి యువరాజు కాబోయె తన కొడుకుని పూర్వస్థితికి తెచ్చుకునే దిశగా గురువుగారైన వశిష్టుని ఆశ్రమానికి పంపటం జరుగుతుంది.... తండ్రి పంపగా గురువు దర్శనానికి ఆశ్రమానికి విచ్చేసిన శ్రీరాముడు వశిష్టుడి కుటీరం ముందు నిలబడి వినమ్రుడై గురువు గారిని పిలవటం జరిగింది. లోపలి నుండి ఎవరు నాయనా నువ్వు అన్న ప్రశ్నకు "అది తెలుసుకోవడానికే వచ్చాను గురువు గారు " అంటూ సమాధానమిచ్చాడు.

కోటలు పేటలు, రథ, గజ, తురగ బలాలు, అంతపురాలు, దాసదాసీ జనాలు, అష్టైశ్వరాలు, చక్రవర్తి కుమారుడు, మహా సామ్రాజ్యానికి యువరాజు అన్న హోదాలు వీటిలో ఏ ఒక్క దానిని ఆలంబనగా చేసుకొని తన పరిచయాన్ని చేసుకోలెదు శ్రీరాముడు అట్టి యెడ ముష్ఠి బ్రతుకుల మనకు ఎన్ని గుర్తింపులో కదా !

శ్రీరాముని చరిత్రను తెలిపే వాల్మీకి రామాయణం లో 24000 శ్లోకాలుంటే శ్రీరామునికి కలిగిన నైరాశ్యమును తొలగింప చేయుటకు వశిష్టుడు చెప్పిన "యోగా వాశిష్టం " 32000 శ్లోకాలతో అవతరించినది..