Monday, May 18, 2009

గుర్తింపుకై ప్రాకులాట



రెందు రోజుల క్రితం వధువు ఇంటి దగ్గర జరిగిన వివాహం తాలూకు వరుడి తరపున ఏర్పాటు చేసిన పెళ్ళి విందుకు వెళ్ళిన నేను స్నేహితులతో హుషారుగా మాట్లాడుతున్న సమయం లో అక్కడికి వచ్చి చేరాడు నా స్నేహితుడు వెంకటకృష్ణ. వాడిని పలకరించిన పిమ్మట అక్కడి నా స్నేహితులకి వాడి పేరు,ఊరు,చేస్తున్న ఉద్యోగం వంటి వివరాలతో పరిచయం చేశాను. ముఖాలపై నవ్వులు పులుముకొని నా స్నేహితులందరు మా వాడిని పలకరించి తమలో ఒక్కడిగా కలుపుకున్నరు. ఇక మా వాడిలో మొదలయింది తపన, తన హోదా,భేషజాలకి సరిపడే రీతిగా తనని నేను మా వాళ్ళకి పరిచయం చేయలేదనుకున్నాడేమో కాబోలు వెంటనే అందుకున్నాడు స్వంతదండకం, ఫలాన బిజినెస్ మాగ్నట్ సుబ్బారావ్ లేడండి అతను నాకు స్వయాన మేనమామ, సెక్రటేరియట్ లో డిప్యూటి సెక్రటరి హోదాలో పని చేసె కిషోరు బాబు మా తోడల్లుడు, ఉస్మానియా యూనివర్సిటి లో "డీన్" గా పని చేసె సుబ్రమణ్యం మా పెద్దమ్మ గారి కొడుకు అంటూ ఇలా చెప్పుకుంటూ క్షణ క్షణానికి ఎదుటి వారిలో తన పట్ల గౌరవ సూచక దృక్కుల్ని వెతుకులాడుతున్నాడు.
నిజమే! ఈ రోజు పెళ్ళి విందు రేపు మరొకటి ఏదైతేనేం నలుగురు చేరిన ప్రతి చోట తన పరిచయం తాలూకు వివరాలన్ని వీలైనన్ని ఎక్కువ చెప్పుకుంటేనే గాని తమ ఉనికిని ధ్రువపరచుకోని మహనీయులెందరో కదా!
తన ఉనికిని గోరంతలు కొండంతలుగా చెప్పుకుంటేగాని ఎదుటివారికి తన పట్ల గౌరవం కలగదనుకునే దౌర్భాగ్యుల దృష్ట్యా ఈ క్రింది దృష్ట్యాంతమును చెప్పుకుందాం.

నూనుగు మీసాల నూత్న యవ్వనంలోకి ప్రవేశించిన శ్రీరాముడు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని దేశదేశాలు పర్యటించి, పుణ్యక్షేత్రాలు సేవించుకొని అయోధ్యకు తిరిగి వచ్చాడు, వచ్చిన నాటి నుండి ఎవరితోను మాట్లాడటం లేదు, ఎవరు పలకరించినా ముభావంగా ఉంటున్నాడు,, మనిషి జీవితం లో పుట్టింది మొదలు గిట్టేవరకు అనునిత్యం సంఘర్షణలను తలచుకొని ఏం ప్రయోజనార్థం ఈ లోకానికి వచ్చాం, ఏం సాధించి ఇక్కడి నుండి నిష్క్రమిస్తున్నాం...ఈ మధ్య జీవితం లో ఎన్ని మజిలీలు, ఎన్ని బాంధావ్యాలు, బాధలు ఇలాంటి మనోవైకల్యం తో నిర్గుణుడై యున్న కొడుకుని చూచి బాధపడిన దశరథుడు రేపటి యువరాజు కాబోయె తన కొడుకుని పూర్వస్థితికి తెచ్చుకునే దిశగా గురువుగారైన వశిష్టుని ఆశ్రమానికి పంపటం జరుగుతుంది.... తండ్రి పంపగా గురువు దర్శనానికి ఆశ్రమానికి విచ్చేసిన శ్రీరాముడు వశిష్టుడి కుటీరం ముందు నిలబడి వినమ్రుడై గురువు గారిని పిలవటం జరిగింది. లోపలి నుండి ఎవరు నాయనా నువ్వు అన్న ప్రశ్నకు "అది తెలుసుకోవడానికే వచ్చాను గురువు గారు " అంటూ సమాధానమిచ్చాడు.

కోటలు పేటలు, రథ, గజ, తురగ బలాలు, అంతపురాలు, దాసదాసీ జనాలు, అష్టైశ్వరాలు, చక్రవర్తి కుమారుడు, మహా సామ్రాజ్యానికి యువరాజు అన్న హోదాలు వీటిలో ఏ ఒక్క దానిని ఆలంబనగా చేసుకొని తన పరిచయాన్ని చేసుకోలెదు శ్రీరాముడు అట్టి యెడ ముష్ఠి బ్రతుకుల మనకు ఎన్ని గుర్తింపులో కదా !

శ్రీరాముని చరిత్రను తెలిపే వాల్మీకి రామాయణం లో 24000 శ్లోకాలుంటే శ్రీరామునికి కలిగిన నైరాశ్యమును తొలగింప చేయుటకు వశిష్టుడు చెప్పిన "యోగా వాశిష్టం " 32000 శ్లోకాలతో అవతరించినది..

No comments:

Post a Comment