Friday, May 22, 2009

సాంసారిక లంపటం



"మీ మానవులు చాలా స్వార్థపరులు, అహంకారపూరితులు" భక్తుడి భక్తి పారవశ్యతకు చకితుడై ఎదుట ప్రత్యక్షమై అతనితో భగవంతుడు అన్న మాటలివి.....ఎందుకు స్వామి మా పై కోపగించుకుంటారు మాలో కనిపించిన స్వార్థం, అహంకారములెట్టివో సెలవిస్తే వాటిని సరి చేసుకుని తరిస్తామన్న భక్తుడితో ఆ దేవుడు "లక్షలాది రకాలతో కోట్లాది జీవులు ఈ భూగోళం పై నివసిస్తూ ఉంటే వాటిల్లో ఏ ఒక్క ప్రాణి రూపం లో కాకుండా నన్ను మీ రూపం లోకి తెచ్చుకొని పూజించటం మీ స్వార్థమైతే, జీవులన్నింటిలొకి అత్యధిక తెలివి పరులం మానవులమైన మేమే అన్నది మీ అహంకారం కాక మరేమిటని తెలియపరచగా ఆ భక్తుడికి నోట మాట రాలేదు.

సర్వాంతర్యామి, చైతన్య స్వరూపుడు అయిన దేవుడిని తన రూపం లోకి కుదించుకుని మనిషి పూజించటం వరకు మాత్రమే ఆగలేదు, తనకున్న సాంసారిక లంపటాల్ని అన్నింటిని దేవుడికి తగిలించి మరి వినోదించసాగాడు. భార్యాపిల్లలు,బంధువులు, సంసారం,వివాహం,వేడుకలు ఇలా ఒక్కటేమిటి తాను నిత్యం ఏ కార్యకలాపాలతో పొద్దుపుచ్చుతుంటాడో వాటన్నింటిలోకి దేవుడిని ప్రతిబింబింప చేసిన ఘనుడు.

సాంసారిక బంధాలతో విసిగిన మనిషి తాత్విక చింతనను ఆలంబనగా చేసుకొని మనశ్శాంతికై గుడికి వెడితే కళ్యాణం చేసుకుంటూనో, దేవేరులతో ఊరేగుతూనో, కొడుకులను లాలిస్తునో, కూతుళ్ళను పాలిస్తునో మనకు స్వాగతం పలుకుతాడు ఆ దేవుడు. నిర్గుణుడై, నిరాకారి అయి ,విరాగి అయి, కనిపించని ఆ దేవుడు మన హృదయంలో వైరాగ్యాన్ని ఎలా నింపగలగుతాడు.

తనకున్నా సాంసారిక బంధనాలన్నింటిని ఆ దేవుడికి తగిలించి నిత్యం ఆ సాంసారిక సాగరంలో మునకలేయించే ఈ మనిషి ఆశ్రమ ధర్మాలలో గృహస్తాశ్రమాన్ని పటిష్ట పరచుకొని తదుపరి వానప్రస్థ, సన్యాసములను కనుమరుగు చేసుకుంటున్నాడేమోననిపిస్తుంది.

"ఆలు బిడ్డలనుచు, యతి మోహమున నున్న
ధనము మీది వాంఛ దగిలి యున్న
యట్టివాంకి ముక్తి యవనిలో లేదయా
విశ్వదాభిరామ వినురవేమా."

భార్యా పిల్లలపై మక్కువ, ఆస్తి పాస్తులపై లాలసతతో సతమతమయ్యే వాడు ముక్తికి మరి అనర్హుడైతే అలాంటి సాంసారిక లంపటాల్ని తగిలించుకున్న ఆ దేవుడు మనకు ముక్తి నెట్లు ప్రసాదిస్తాడో!

No comments:

Post a Comment